తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై నిర్మాత దిల్ రాజు లేఖ

తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలయిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా నా నమస్కారాలు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగే సమయంలో, యలమంచి రవిచంద్ వచ్చి, ఈ ఎలక్షన్ లో మీరందరూ రావాలని అడిగాడు.  ఎందుకు రావాలి అని అడిగినపుడు, కౌన్సిల్ బావుండాలి, వెల్ఫేర్ బాగా జరగాలి, ఆర్ధికంగా చితికిపోయిన నిర్మాతలకు సహాయం కావాలి, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అయిన మీరు మీ సమస్యలను ఎలాగూ సొంతంగా పరిష్కరించుకోగలరు. కాబట్టి మీరందరూ కౌన్సిల్ వెల్ఫేర్ ని అభివృద్ది చేయడానికి ముందుకి రావాలి అని అడగడంతో, వెల్ఫేర్ కోసం అయితే మేము అందుకు అవసరమైన ఫండ్స్ సహాయం చేస్తాము అంటే, అలా కాదు, మీరు వచ్చి కౌన్సిల్ లో కలిసి పోవాలని, గిల్డ్ ని కూడా కలపమని అడిగితే, కౌన్సిల్ బై లా చేంజ్ అయిన వెంటనే గిల్డ్ ని కౌన్సిల్ లో కలపడం జరుగుతుంది, అలా కాని పక్షం లో గిల్డ్ ని కలపడం జరగదు అని యలమంచి రవిచంద్ కి చెప్పినపుడు, సరే సర్ ముందు మీరు వచ్చి వెల్ఫేర్ అభివృద్ది చేయండి, ముఖ్యం గా ఇన్సూరెన్స్ కార్డ్ విషయం లో నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు వచ్చి ముందుగా అది చేయాలి సర్.  అందుకు మీరు ఎలక్షన్ లో పోటీ చేయాలి అని చెప్పినపుడు సరే అని అందుకు అంగీకరించి ముందుకు వచ్చి, వెల్ఫేర్ అభివృద్ది కోసం ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఇతర నిర్మాతలయిన మోహన్ వడ్లపట్ల, మోహన్ గౌడ్ అందరూ పూనుకుని, ఒకటిగా కలిసి ఎలక్షన్స్ కి రావడం జరిగింది. మీరంతా మమ్మల్ని మెజారిటీతో గెలిపించారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 

ఈ ప్రక్రియలో మేము హెల్త్ ఇన్షూరెన్స్ కార్డ్, మేరేజెస్, పెన్షన్స్, ఎడ్యుకేషన్ వంటివి అభివృద్ది చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. వాటిలో ఇన్షూరెన్స్ కార్డ్ తీసుకురావడానికి అన్నీ కంపెనీలతో మాట్లాడి, ఏది తక్కువకు వస్తుందో అని తెలుసుకొని implement చేయడానికి కొంచెం ఆలస్యం అయింది, అయినా చివరికి నాలుగు లక్షల  ఇన్సూరెన్స్ ని తీసుకు వచ్చాం. అదే విధం గా పెన్షన్ ని, ఇంతకు ముందు ఉన్న దానికన్నా పెంచి ఇవ్వడం జరిగింది. మిగతా హామీలు కూడా నెరవేర్చడానికి ఉన్న ఫండ్ ని డిస్టర్బ్ చేయకుండా, కొత్త ఫండ్ ని ఎలా gather చేయాలి, ఇన్ని ఏళ్లు గా ఉన్న సిస్టమ్ ని కాకుండా ఒక కొత్త సిస్టమ్ తో మెరుగైన విధానాన్ని ఎలా తీసుకురావాలి అనే చర్చలు జరుగుతున్నాయి. ఆలస్యం అయినా కూడా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం. 

ఇప్పుడు ఛాంబర్ ఎలక్షన్స్ లో నేను చెప్పదలచుకుంది ఏంటంటే, ప్రెస్ మీట్ లు పెట్టి, ఒకరినొకరు నిందించుకుని ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం, కుట్రలు కుతంత్రాలు అని అల్లరి చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసి పదవిలోకి రావడం అనేది మాకు ఇష్టం లేదు, అలా చేయము కూడా. అలాంటివి చేస్తే వచ్చే పదవులు మాకు అవసరం లేదు.  మేము వచ్చేది పదవుల కోసం కాదు. ప్రతీ మెంబర్ కి తెలుసు మాకు పదవులు అవసరమో లేదో. మమ్మల్ని ఇన్నాళ్ల నుండి చూస్తున్నారు, అదే విధం గా మేము ఏం చేయగలము అనేది మీకు తెలుసు. పదవి కోసం, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము వస్తుంది ఎందుకు అంటే, కౌన్సిల్ కి రమ్మని అడిగినపుడు వచ్చి ఎలా చేశామో, ఛాంబర్ కు వచ్చి కూడా అలానే చేయాలి అనుకుంటున్నాం. కానీ కొంతమంది, ఇంతకు ముందు ముప్పై రోజుల స్ట్రైక్ జరిగినపుడు జరిగిన కొన్ని సంఘటనలను వేలెత్తి చూపిస్తున్నారు. అప్పుడు జరిగిన కొన్ని పరిణామాల వలన, కొంత మంది ఒత్తిడి వలన సినిమాలని మేము కూడా ఆపలేని పరిస్థితికి తీసుకుని వచ్చారు. అయినా సరే ఇప్పుడు వాటి గురించి, వివరించి, మళ్ళీ వేరొకరిని నిందించాలని మేము అనుకోవడం లేదు. UFO, QUBE సిస్టమ్ ల సమస్య ఎప్పటి నుండో ఉన్న సమస్య. ఒక్కరోజులో అది మార్చడం అనేది తేలిక కాదు. అయినా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నాం. అది చేయడానికి టైమ్ పట్టినా కూడా ఎట్టి పరిస్థితులలోనూ సమస్యను పరిష్కరిస్తాం. 

ఇప్పుడు ఉన్న మా పానెల్ లో రెగ్యులర్ గా పెద్ద సినిమాలు చేసే రన్నింగ్ ప్రొడ్యూసర్స్ 70%, రెగ్యులర్ గా చిన్న సినిమాలు నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ 30% ఉన్నారు. ఎందుకంటే, ఈ 70% ప్రొడ్యూసర్స్ షూటింగ్ ల వల్ల ఒకవేళ అప్పటికప్పుడు అందుబాటులో లేకపోయినా, మిగిలిన 30% ఉన్న అనుభవజ్ఞులయిన ప్రొడ్యూసర్స్ అందుబాటులో ఉంటారనే మా పానెల్ లో మోహన్ వడ్లపట్ల, బెక్కం వేణుగోపాల్, వై రాజీవ్ రెడ్డి, సతీష్ వేగేశ్న, నక్కా రాహుల్ యాదవ్, మోహన్ గౌడ్, పి.ఎల్.కె రెడ్డీ, జె.సాంబశివరావ్ మరియు పద్మిణీ నాగుల పల్లి, వంటి ఇంకా చాలా మంది నిర్మాతలను తీసుకోవడం జరిగింది. 

మేము నెరవేర్చలేని హామీలు ఇవ్వము. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం. నమ్మకంతో మా పానెల్ ని గెలిపించండి. మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం, చదలవాడ శ్రీనివాస రావు గారు గిల్డ్ ని కౌన్సిల్ లో merge చేయమని అడిగారు. ఆయనకు, మీకు, మాట ఇస్తున్నాం, కౌన్సిల్ బై లా మారిన మరుక్షణం, కౌన్సిల్ లో merge చేస్తాం. ఇంతకు ముందు ఇచ్చిన హామీలలో మిగిలిన రెండు హామీలను కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. 

ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించిన అన్నీ సెక్టార్ లను అభివృద్ధి చేసి, ఇండస్ట్రీ మొత్తాన్ని ఫిల్మ్ ఛాంబర్ అనే గొడుగు కిందకి తీసుకు వచ్చి ఇండస్ట్రీని పటిష్ట పరుచుకోవాలని,  ఒక మంచి గౌరవ ప్రదమైన ఛాంబర్ గా మన ఫిల్మ్ ఛాంబర్ ని నిలబెట్టాలని మా ప్రయత్నం. ఛాంబర్ లో కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంబందించిన సమస్యలను పరిష్కరించడంలో సాధ్యాసాధ్యాలను సమీక్షించి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం.  ఆర్ధికంగా నలిగిపోయిన నిర్మాతలకు చేదోడుగా ఉంటాం. వాళ్ళ వెల్ఫేర్ కోసం, కాస్త ఆలస్యం అయినా సరే, సమస్యను పరిష్కరించేలా ప్రయత్నిస్తాం. అంతేగానీ  అసత్యాలు చెప్తూ, ఇతరులను నిందిస్తూ కాలం గడపడం అనేది మా విధానం కాదు. అలాంటి రాజకీయాలు చేసే ఆలోచన, అవసరం కూడా మాకు లేదు. ఆలోచించి, మా పానెల్ ని గెలిపించవలసిందిగా ప్రతి నిర్మాతని కోరుతున్నాం. ధన్యవాదాలు. 

ఇట్లు, 

మీ
దిల్ రాజు.




No comments