'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో నేను అల్లు ఫ్యామిలీలో పుట్టా, అల్లు అర్జున్ మా అన్నయ్య అని చెప్పే రోల్ చేశా - అంకిత్ కొయ్య ఇంటర్వ్యూ


రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు...

అంకిత్... మీరు చాలా సినిమాల్లో నటించారు. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీ గురించి చెప్పండి!

మాది విశాఖ. గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశా. స్కూల్ డేస్ వరకు సాధారణంగా ఉన్నాను. గ్రూమింగ్ అంటే కూడా తెలియదు. దీపక్ సరోజ్ అని నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు. తను చైల్డ్ ఆర్టిస్ట్. చాలా సినిమాల్లో నటించాడు. అతని వల్ల నాకు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశా. రెండేళ్ల తర్వాత సీనియర్లు కొత్తగా వచ్చే వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వమని నాకు అప్పజెప్పేవారు. అక్కడి నుంచి మెల్లగా యాడ్స్, సినిమాల్లోకి వచ్చాను. కాలేజీలో ఉండగా... అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్ చూసి బన్నీ గారు స్వయంగా నన్ను ఎంపిక చేశారు.

*సినిమాల్లోకి వెళతానని అన్నప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నారు?*
మా నాన్నగారు టీచర్. మా తాతయ్య గారు హెడ్ మాస్టారుగా రిటైర్ అయ్యారు. సో, సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు నో అన్నారు. నాకు ఓ అన్నయ్య ఉన్నాడు. నా బీటెక్ అయ్యేసరికి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. అప్పుడు నాన్నతో 'అన్నయ్య హైదరాబాద్‌లో ఉన్నాడు కదా! రెంట్ కట్టే అవసరం లేదు. తినడానికి ఇబ్బంది ఉండదు. వన్ ఇయర్ ట్రై చేస్తా. అవకాశాలు రాకపోతే మీరు చెప్పినట్టు ఉద్యోగం చేస్తా' అని చెప్పాను. సరే అన్నారు. ఏడాదిలోపే 'మజిలీ' చేసే ఛాన్స్ వచ్చింది. అది విడుదల అయ్యే టైంకి మరో రెండు నెలల్లో 'జోహార్' చిత్రీకరణకు వారణాసి వెళ్లాలని కబురు వచ్చింది. నాగశౌర్య గారి 'అశ్వత్థామ'లో నటించాను. రైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశా. ఆ తర్వాత 'తిమ్మరుసు', 'శ్యామ్ సింగ రాయ్', 'సత్యభామ', రీసెంట్ 'ఆయ్'తో పాటు ఇంకొన్ని సినిమాల్లో నటించాను.

'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

సినిమాలో ఇంద్రజ గారు నాకు అమ్మ క్యారెక్టర్ చేశారు. ఆవిడకు మా దర్శకుడు లక్ష్మణ్ కార్య కథ నేరేట్ చేసినప్పుడు... అబ్బాయి పాత్రకు ఆవిడ నన్ను సజెస్ట్ చేశారు. ఓ సినిమాలో మేం మదర్ అండ్ సన్ రోల్స్ చేశాం. ఆ మూవీ ఇంకా విడుదల కాలేదు. నేను ఆవిడతో షూటింగ్ చేసినది రెండు రోజులే. నా పేరు కూడా ఆవిడకు గుర్తు లేదు. కానీ, లక్ష్మణ్ అన్న కథ చెబితే... ఆ అబ్బాయి అయితే చాలా బావుంటాడని రిఫర్ చేశారు. లక్ష్మణ్ కార్య కనుక్కుంటే... అప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్లు చూసి చేయగలనో లేదో అని సందేహించారు. ఆడిషన్ తర్వాత అంతా ఓకే అయ్యింది.

సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి!

చిన్నప్పుడు ఇంట్లో ఏడిపిస్తారు కదా... 'నువ్వు మాకు పుట్టలేదు. ఎక్కడి నుంచో తీసుకు వచ్చాం' అని! నా క్యారెక్టర్ ఏమిటంటే... 'నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య' అనుకునే టైపు. ఒకానొక సీన్ వచ్చినప్పుడు రావు రమేష్ గారిని 'మా ఇంటికి ఎప్పుడు పంపిస్తావ్' అని కూడా అడుగుతాడు. ఆ క్యారెక్టర్ నుంచి మంచి ఫన్ జనరేట్ అయ్యింది.

'ఆయ్'కి అల్లు అరవింద్ గారు ప్రజెంటర్. ఆయన్ను కలిసినప్పుడు 'మారుతి నగర్ సుబ్రమణ్యం' గురించి అడిగారా?

ఇటీవల అల్లు అరవింద్ గారిని కలిశా. ఆయన 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ట్రైలర్ చూశారు. అందులో నేను అరవింద్ కొడుకును అని చెబుతా కదా! 'ఏవయ్యా... నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నావ్ అంట. తెలిసింది' అని సరదాగా అన్నారు. అల్లు ఫ్యామిలీకి, నాకు ఏదో కనెక్షన్ ఉందేమో! అల్లు అర్జున్ గారితో 'ఓఎల్ఎక్స్' యాడ్ చేశా. అల్లు అరవింద్ గారి బ్యానర్ లో 'ఆయ్' చేశా. ఈ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా.    

రావు రమేష్ గారు మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా? మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భాలు?

నేను ఎలా నటిస్తానో నాకు ఇప్పటికీ తెలియదు. దర్శకుడు చెప్పింది ఫాలో అయిపోతా. రావు రమేష్ గారిని ఒకసారి ఏమైనా సలహా ఇస్తారేమో అని అడిగా. 'నువ్వు బాగా చేస్తున్నావ్. అలా కంటిన్యూ అయిపో' అని చెప్పారు. నాన్నగారు, తాతయ్యగారు నాటకాలు వేసేవారట. బహుశా... ఆ జీన్స్‌ వచ్చాయేమో! రావు రమేష్ గారితో నాకు ఫస్ట్ డే షూటింగ్. మా ఇద్దరి కాంబోలో ఒక సీన్ ఉంది. ఆయన భుజం మీద చెయ్యి వేసి డైలాగ్ చెప్పాలి. ఎప్పుడు, ఏ టైమింగ్ లో చెయ్యి వేయాలో మా దర్శకుడు లక్ష్మణ్ అన్న చెప్పారు. సీన్ అయ్యాక 'మంచి టైమింగ్ ఉంది నీకు' అని మెచ్చుకున్నారు. షూటింగ్ చేసేటప్పుడు షాట్ గ్యాప్ మధ్యలో ఆయనకు కాస్త దూరంగా కూర్చునేవాడిని. ప్యాకప్ చెప్పేసి వెళ్లేటప్పుడు 'లవ్ యు నాన్న' అంటూ హగ్ చేసుకునేవారు. ఆయనతో పని చేశాక మరింత గౌరవం పెరిగింది.

సుకుమార్ గారు సినిమాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన వైఫ్ ప్రజెంట్ చేస్తున్నారు. మీరు వాళ్ళను కలిశారా?

సుకుమార్ గారిని కలిసే అదృష్టం ఇంకా రాలేదు. అయితే, లక్ష్మణ్ అన్న ద్వారా ఎప్పటికప్పుడు సుకుమార్ గారు, తబిత గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారనేది నాకు తెలుస్తోంది. సినిమా చూశాక సుకుమార్ గారు అందరి గురించి బాగా చెప్పారని లక్ష్మణ్ చెప్పారు. సుకుమార్, తబిత దంపతుల దృష్టికి వెళ్లేలా లక్ష్మణ్ సినిమా పబ్లిసిటీ చేశారు.

నిహారికతో లక్ష్మణ్ కార్య 'హ్యాపీ వెడ్డింగ్' చేశారు. ఆమె నిర్మాణ సంస్థలో మీరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు లక్ష్మణ్ కార్యతో మీరు సినిమా చేశారు. ఆవిడ ఏమన్నారు?

నిహారిక 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'కు వచ్చే కథలు ఫిల్టర్ చేసి ఆవిడ దగ్గరకు నేను పంపిస్తా. 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా చేసే అవకాశం వచ్చిందని తెలిసి 'లక్ష్మణ్ కార్య మంచి దర్శకుడు. అవకాశం వదులుకోకు' అని చెప్పారు. ఈ సినిమాను ప్రమోట్ చేస్తానని అన్నారు. 'ఆయ్' మంచి విజయం సాధించింది. అది 'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నా.

No comments