ఇండ్ల స్థలాలు వెంటనే ఇప్పించాలని మీడియా అకాడమీ చైర్మన్ కు వినతి - సానుకూలంగా స్పందించిన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలకై ఏకతాటిపైకి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు.

హైదరాబాద్: హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీల ఐక్యకార్యాచరణ సమితి సమావేశం సోమవారం దేశోద్ధారక భవన్ లో ది జర్నలిస్టు హౌసింగ్ కో ఆపరేటివ్ సోసైటీ సీనియర్ సభ్యులు కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి గారిని హైదరాబాద్ హౌసింగ్ సోసైటీ సభ్యుల బృందం (ది జర్నలిస్ట్ హౌసింగ్ కో ఆపరేటివ్ సోసైటీ లిమిటెడ్,దక్కన్ జర్నలిస్టు మ్యూచివల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ, తెలంగాణ జర్నలిస్టు మ్యూచివల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ ) కలిసి నాన్ అలాటీ జర్నలిస్టులందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు ఇప్పించాలని మీడియా అకాడమీ చైర్మన్ ను కోరడం జరిగింది. భవిష్యత్తులో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో సోసైటీలకతీతంగా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

త్వరలో జర్నలిస్టులతో జరిగే ముఖ్యమంత్రి గారి సభ అందరు జర్నలిస్టులకు శుభవార్త అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యుల వినతికి మీడియా అకాడమీ చైర్మన్ సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరగా జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇప్పించడం కోసం ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టి శాట్ చైర్మన్ బి.వేణుగోపాల్ రెడ్డి, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ సిరిగిరి విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లు బ్రహ్మండబేరి గోపరాజు, భీమగాని మహేశ్వర్,ఎం.సూరజ్ కుమార్ , సి.హెచ్ .రాకేష్ రెడ్డి, బి.రవి, ఎం.శ్రీనివాస్ , అయ్యప్ప, రామకృష్ణ, శిగ శంకర్ గౌడ్, సునీత, రవీంద్రబాబు పాల్గొన్నారు.

No comments