ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి...


పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలిఎలక్షన్స్ అప్పుడు వాడుకుని ఆ తర్వాత ఆంధ్ర వాళ్లను కించపరచడమే బీఆర్ఎస్ పార్టీ విధానమా! ఆ పార్టీనే తేల్చుకోవాలి -నిర్మాత నట్టి కుమార్ ఫైర్ 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి, ఎక్కడి ప్రజలు అక్కడ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న తరుణంలో ప్రాంతీయతను గురించి కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం ప్రజల మధ్యన వివాదాలు సృష్టించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. 

హైదరాబాద్ అభివృద్ధిలో, అలాగే తెలంగాణాలో పరిశ్రమలు, వ్యాపారాల స్థాపనలో ఆంధ్ర వాళ్ళు కీలక పాత్ర పోషించింది నిజం కాదా! ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఎలక్షన్స్ అప్పుడు ఆంధ్ర వాళ్ల ఓట్లను బీఆర్ఎస్ ఉపయోగించుకున్నది నిజం కాదా! ఎమ్మెల్యేల గెలుపులో వారి ఓట్లు కీలకం కాదా! బీఆర్ఎస్ నేతలు పునరాలోచించాలని ఆయన స్పష్టం చేశారు. 

ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఆంధ్ర ప్రజల పేరెత్తి ద్వేషపూరిత మాటలు మాట్లాడటం ఎంతమాత్రం తగదని, ఈ మాటలకు ఆ గొడవలకు అసలు సంబంధమే లేదని అన్నారు. విభజన అనంతరం ఆంధ్ర, తెలంగాణ ప్రజలు అన్నదమ్ములు లాగా కలసిపోయి, రెండు తెలుగు రాష్ట్రాలు సహరించుకుంటూ, అభివృద్ధి సాధించాలని ఇరువైపుల వారు కోరుకుంటుంటే ఇలాంటి రాజకీయ నాయకులు దానికి తూటాలు పొడవటం ఎంతమాత్రం తగదని అన్నారు. 

అందుకే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన మాటలను సుమోటాగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేయాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, లేకుంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ల విధానమే అది అవుతుందని ఆయన అన్నారు. 

వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రాంతాల ప్రజలతో సంబంధం లేకుండా లా అండ్ ఆర్డర్ ఎన్నో సందర్భాలలో అదుపు తప్పిందని ఆయన విమర్శించారు. గతంలో డి.శ్రీనివాస్ ఇంటిపై జరిగిన దాడి ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పవచ్చునని అన్నారు.

No comments