వరద బాధితులకు మెగా డాటర్ నిహారిక కొణిదెల విరాళం
ప్రతిభావంతులైన నటి, అభిరుచి గల నిర్మాత నిహారిక కొణిదెల సామాజిక బాధ్యత పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి ప్రదర్శించారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి రూ. 9.45 కోట్ల వరకు విరాళాన్ని అందించారు. ఇక నిహారిక వ్యక్తిగతంగా రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
బుడమేరు నది వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పది గ్రామాలపై నిహారిక దృష్టి కేంద్రీకరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో గ్రామీణ సమాజాలు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లపై ఆమెకున్న అవగాహన ఏంటో అర్థం అవుతోంది. నగర వాతావరణంలో పెరిగినప్పటికీ, నిహారికకు గ్రామీణ జీవితంతో లోతైన సంబంధం ఉంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళంగా ఇవ్వడం.. గ్రామ పంచాయితీలకు లక్ష చొప్పున నాలుగు కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ బాటలోనే నిహారిక కూడా పది గ్రామాలకు 50,000 చొప్పున మొత్తంగా ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించారు. నిహారిక విరాళాన్ని ప్రకటించడంపై నెటిజన్లు కూడా ఆమె నిస్వార్థ చర్యను ప్రశంసిస్తున్నారు.
నిహారిక ఆర్థిక విరాళాన్ని ప్రకటిస్తూ.. ‘బుడమేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలే. నేను పుట్టి పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే కాబట్టి వారి చెప్పే అనుభవాలు విన్న దృష్ట్యా నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో అభిమానం ఉంది.
ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మా కుటుంబీకులు అందరూ బాధితులకు అండగా నిలబడడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
నేను కూడా ఈ బృహత్కార్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉడతా భక్తిగా వరద ముంపుకు గురైన ఒక పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షలు రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.
No comments