గ్లోబల్ స్టార్ గోల్డెన్ హార్ట్...
నటనలోనే కాదు... మనసులోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హార్ట్ ఇష్యూ (పల్మనరీ హైపర్‌టెన్షన్) జన్మించిన, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పాప పాలిట ప్రాణదాతగా నిలిచారు.
ఆగష్టు 22... మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఒక ఫోటో జర్నలిస్ట్ కుటుంబంలో ఆ రోజే ఒక చిన్నారి జన్మించింది. అయితే... పాప గుండెల్లో ఏదో సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. బతకడం కష్టమని, ఛాన్సులు తక్కువ అని కూడా చెప్పారు.
అప్పుడు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ జనరల్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించే స్థోమత ఫోటో జర్నలిస్ట్ ఫ్యామిలీకి లేదు. ఆ విషయం రామ్ చరణ్ దృష్టికి వెళ్ళింది.
పాప ఆరోగ్య స్థితి గురించి తెలిసిన చరణ్... ఆ చిన్నారి చికిత్స బాధ్యతను తీసుకున్నారు. ఆగష్టు 24న ఆ చిన్నారిని ఆస్పత్రిలో జాయిన్ చేసినప్పటి నుంచి... ఈ రోజు వరకు రామ్ చరణ్ ఆఫీసు నుంచి ఎప్పటికప్పుడు పాప ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ అవసరమైన సాయం అందించారు. చిన్నారి చికిత్సకు అవసరమైన బ్లడ్, ప్లెట్లెట్స్ వంటివి అందించడంలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ తోడుగా నిలిచింది. ఫైనల్లీ, 53 రోజుల తర్వాత అక్టోబర్ 16న ఆరోగ్యంగా ఆ పాప డిశ్చార్జ్ అయ్యింది. ఆ చిన్నారి ఇంట సంతోషం వెల్లివిరిసింది. ఆ సంతోషం వెనుక ఉన్న రూపం, ధైర్యం... రామ్ చరణ్. దటీజ్ గ్లోబల్ స్టార్ గోల్డెన్ హార్ట్.
No comments