'మిస్టర్ మాణిక్యం'గా సముద్రఖని ఫస్ట్ లుక్ & రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నారంగ్
దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సముద్రఖని, ఇప్పుడు నటుడిగా కూడా అన్ని భాషల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. 'అల వైకుంఠపురములో', 'క్రాక్' నుంచి మొదలు పెడితే 'హనుమాన్' వరకు ప్రతి సినిమాలోనూ తాను ధరించిన పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. తాను ధరించిన పాత్రల ద్వారా తెలుగువారికి చేరువైన సముద్రఖని ఇప్పుడు ‘మిస్టర్ మాణిక్యం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సముద్రఖని ప్రధాన పాత్రలో నంద పెరియసామి దర్శకత్వంలో జీపీ రేఖా రవి కుమార్, చింతా గోపాలకృష్ణా రెడ్డి, రాజా సెంథిల్ ఈ ‘మిస్టర్ మాణిక్యం’ చిత్రాన్ని నిర్మించారు. 'సీతారామం' ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. డిసెంబర్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నారంగ్ చేతుల మీదుగా సినిమా ఫస్ట్ లుక్ & రిలీజ్ డేట్ పోస్టర్ ఆదివారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా సునీల్ నారంగ్ యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘‘నిర్మాతల్లో ఒకరైన రవి నాకు ఎంతోకాలం నుంచి మంచి స్నేహితుడు. అతను నిర్మించిన మొదటి సినిమా ‘మిస్టర్ మాణిక్యం’ ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ‘‘నిర్మాతలు రవి, చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజా సెంథిల్ నాకు సన్నిహితులు. శ్రేయోభిలాషులు. కంటెంట్‌ని నమ్మి నిర్మించిన సినిమా ఇది. మానవతా విలువలకు పట్టం కట్టే విధంగా ఈ సినిమా కథాంశం వుంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని, నిర్మాతలకు మంచి ఖ్యాతితోపాటు డబ్బు కూడా సంపాదించి ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
ప్రధాన పాత్రధారి సముద్రఖని తన హృదయావిష్కరణ చేస్తూ, ‘‘విమానం తర్వాత నేను ప్రధానపాత్రలో నటించిన సినిమా ఇది. ‘విమానం’ సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెచ్చింది. ‘మిస్టర్ మాణిక్యం’ సినిమా అంతకు మించిన మంచి పేరు తెస్తుందన్న నమ్మకం వుంది. మానవతా విలువలు ప్రధానాంశంగా రూపొందిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి మనసులను హత్తుకునే అనేక అంశాలు ‘మిస్టర్ మాణిక్యం’లో వున్నాయి. కుటుంబంతో సహా థియేటర్లకు వచ్చి చూసేంత క్లీన్ కంటెంట్ వున్న సినిమా ఇది. ఈ విషయంలో ప్రేక్షకులకు నా తరఫున పూర్తి భరోసా ఇస్తున్నాను. కుటుంబ సమేతంగా మా సినిమా చూడటానికి రండి’’ అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రవి మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా కథ వినగానే సముద్రఖని ఎంతో ఎగ్జయిట్ అయి నటించడానికి అంగీకరించారు. ‘మిస్టర్ మాణిక్యం’ సినిమాకి పనిచేసిన సముద్రఖని, నాజర్, భారతీరాజా... ఇలా ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమాకు పనిచేశామన్న సంతృప్తిని వ్యక్తం చేస్తు్న్నారు. నేను సినిమా పరిశ్రమలో చాలాకాలం నుంచి వున్నాను. నిర్మాతగా ఇది నాకు మొదటి సినిమా. కథ బాగా నచ్చి సినిమా తీయాలన్న నా ఆసక్తికి చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజా సెంథిల్ నుంచి ప్రోత్సాహం లభించడంతో మేం ముగ్గురం కలసి ఈ సినిమా నిర్మించాం. సాధారణంగా చాలామంది కష్టపడి సినిమా నిర్మించాం అంటూ వుంటారు. మేము మాత్రం చాలా ఇష్టపడి ఈ సినిమా నిర్మించాం. ప్రేక్షకులు కూడా మా సినిమాని ఇష్టపడతారన్న నమ్మకం వుంది. డిసెంబర్ 28న మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
దర్శకుడు నంద పెరియసామి మాట్లాడుతూ, ‘‘మానవతా విలువలతో కూడిన, వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే విధంగా వుండే కథాంశంతో ‘మిస్టర్ మాణిక్యం’ రూపొందించాను. కుటుంబంతో కలసి చూసే విధంగా ఈ సినిమా రూపొందింది’’ అన్నారు.
'మిస్టర్ మాణిక్యం' సినిమాలో సముద్రఖని భార్యగా అనన్య నటించారు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అ ఆ'లో నితిన్ సిస్టర్ క్యారెక్టర్ చేసినది ఈ అమ్మాయే. తెలుగులోనూ విజయం సాధించిన 'జర్నీ'లో ఓ హీరోయిన్. ఇతర ప్రధాన పాత్రల్లో సీనియర్ దర్శకుడు భారతి రాజా, నటుడు నాజర్ నటించగా... కీలక పాత్రల్లో తంబి రామయ్య, ఇళవరసు, తరుణ్, కరుణాకరన్, చిన్ని జయంత్, వడివుక్కరసి నటించారు.
ఈ చిత్రానికి కూర్పు: ఎస్పీ రాజా సేతుపతి, కళ: సాగు, స్టంట్స్: దినేష్, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: జీపీ రవి రేఖా కుమార్, చింతా గోపాలకృష్ణా రెడ్డి, రాజా సెంథిల్, దర్శకత్వం: నంద పెరియసామి.
No comments