దర్శకుడిగా 25 ఏళ్ల జర్నీ చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఊహించని ఎన్నో అద్భుతాలు నా కెరీర్ లో జరిగాయి: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీను వైట్ల

'నేను ఊహించని ఎన్నో అద్భుతాలు నా కెరీర్ లో జరిగాయి. దర్శకుడిగా 25ఏళ్ల జర్నీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. నన్ను ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు, మీడియాకి, ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాతలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు అందరికీ కృతజ్ఞతలు'అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీను వైట్ల. 'నీ కోసం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీనువైట్ల. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకొని ఘన విజయాన్ని సాధించింది. ఏడు నంది అవార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనువైట్ల విలేకరులు సమావేశంలో తన జర్నీ గురించి పలు ఆసక్తికరమైన విశేషాల్ని పంచుకున్నారు.

దర్శకుడిగా 25 ఏళ్ల జర్నీ ఎలా అనిపిస్తోంది ?

-చాలా చాలా ఆనందంగా వుంది. డైరెక్టర్ కావాలని నా చిన్నప్పటి నుంచి కోరిక. చిన్న వయసులోనే సినిమాల కోసం చెన్నై వెళ్లాను. డైరెక్టర్ కావాలనే పాషన్, ఇంట్రస్ట్ వుంది తప్పా 25 ఏళ్ళు దర్శకుడిగా వుంటానని నిజంగా ఆరోజు ఊహించలేదు. నేను ఊహించని ఎన్నో అద్భుతాలు నా కెరీర్ లో జరిగాయి. ఇది బ్యూటీఫుల్ జర్నీ. నన్ను దర్శకుడిగా ఆదరించి, ఈ 25వ సంవత్సరంలో కూడా 'విశ్వం' లాంటి మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి, మీడియాకి, నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రొడ్యూసర్స్, నటీనటులకు అందరికీ ధన్యవాదాలు.

25 ఏళ్ల జర్నీలో ఇంకా సాధించాల్సిన లక్ష్యం ఏదైనా మిగిలిందా?

- టు బి ఫ్రాంక్... 25 ఏళ్ళు అయ్యిందని అంటున్నారు కానీ నేను నమ్మలేకపోతున్నాను. నిన్నమొన్నలానే వుంది నాకు. అనుభవంతో పాటు నాలో పాషన్ ఇంకా పెరుగుతోంది. నేను సాధించింది ఎక్కువని అనుకోను. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలనే కోరిక బలంగా వుంది. ఇంకా చాలా తీయాలని వుంది.

'నీ కోసం' సినిమా జర్నీ గురించి ?

-నాతొలి సినిమా ఆగిపోవడంతో డిస్సాపాయింట్ అయ్యాను. రవితేజ నా ఫ్రెండ్. ఆ టైం లో నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నా ట్యాలెంట్ పై తనకి చాలా నమ్మకం. అప్పుడు ఓ కథ రాసుకొని తక్కువ బడ్జెట్ లో చేయాలని అనుకున్నాను. కొంతమంది కొత్త నిర్మాతలు వచ్చారు. అలా 'నీ కోసం' సినిమా స్టార్ట్ చేశాం. అప్పుడు కూడా కొన్ని కారణాల వలన సినిమాకి కొంతకాలం ఆగింది. రవితేజ ప్రోత్సాహంతో ఆ సినిమాని ఫినిష్ చేశాను. ఫస్ట్ కాపీ నాగార్జున గారు చూశారు. ఆయనకి బాగా నచ్చింది. నాకు డైరెక్షన్ ఆఫర్ కూడా చేశారు. ఈనాడు రామోజీ రావు గారు సినిమాని చూశారు. ఆయనకి చాలా నచ్చింది. ఆయన సినిమాని ఔట్రేట్ కి కొనేశారు. ఆయనే ప్రొడ్యూసర్ లా అందరికీ సెటిల్ చేసి సినిమాని తీసుకుని రిలీజ్ చేశారు. నిజంగా రామోజీ రావు గారి వలనే ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆయన చాలా మంచి రిలీజ్ ఇచ్చారు. ఒక మంచి సినిమా ఆగకూడదనే ఉద్దేశంతో తీసుకున్నానని, నాకు వారి బ్యానర్ లో సినిమా ఇస్తానని రిలీజ్ కి ముందే ఆయన నాకు చెప్పారు. ఆ బడ్జెట్ కి సినిమా రీజనబుల్ ఆడింది. మొత్తం ఆ సినిమాకి ఏడు నంది అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా అనిపించింది. రామోజీ రావు గారు చెప్పినట్లే నాకు వారి బ్యానర్ లో 'ఆనందం' సినిమా ఇచ్చారు. ఈ సందర్భంగా రామోజీ రావు గారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

'నీ కోసం' సినిమాని రవితేజ గారితో చేయడానికి కారణం ?

-రవితేజ వెరీ ట్యాలెంటెడ్. అప్పటికే ఆయన సింధూరం సినిమా చేశారు. తన ట్యాలెంట్ పై నాకు బాగా నమ్మకం వుంది. ఆ కథకు తనే హీరో అనుకున్నాను. తనకి కూడా నాపై అదే అభిప్రాయం వుంది. ఇద్దరం కలసి కష్టపడి ఆ సినిమా చేశాం.  

'నీ కోసం' సినిమాలో మీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ?

-నాగార్జున గారు డైరెక్షన్ ఆఫర్ చేయడం, రామోజీ రావు గారికి సినిమా నచ్చడం, ఆయన రిలీజ్ చేయడం, అన్ని అవార్డ్స్ రావడం.. ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్.  

మీ జర్నీలో టాప్ 5 మూవీస్ చెప్పమంటే?

-ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు, ఢీ

అజిత్ గారితో దూకుడు రీమేక్  చేస్తారని అప్పట్లో వినిపించింది ? ఆ ప్రాజెక్ట్ చేయకపోవడానికి కారణం?

-సరిగ్గా అదే సమయంలో బాద్‍షా చేశాను. దాని వలన ఆ రిమేక్ కుదరలేదు. బాద్‍షా పెద్ద హిట్ కావడం వలన దూకుడు రిమేక్ చేయలేకపోయాననే రిగ్రేట్ లేదు.

'విశ్వం' తో మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా ?

-వందశాతం రీచ్ అయ్యాం. మంచి కం బ్యాక్ కావాలని అనుకున్నాను. నేను అనుకున్నట్లే ప్రేక్షకులు సినిమాని ఆదరించారు. వర్డ్ అఫ్ మౌత్ పవర్ తో ఆ సినిమాని నిలబెట్టిన ప్రేక్షకులు కృతజ్ఞతలు. అందరం విశ్వం విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం.

మీ నుంచి రాబోయే సినిమా ఎలా వుండబోతోంది ?

-విశ్వం ద్వారా ఆడియన్స్ మంచి రిలీఫ్ ఇచ్చారు. ఇప్పుడు రాబోయే సినిమా ప్రేక్షకులు నా నుంచి ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ ని కోరుకుంటున్నారో ఆ వినోదం ఉంటూనే ఒక ఫ్రెష్ ఐడియాతో వుంటుంది. ఆ ఫ్రెష్ ఐడియా ని ఫుల్ లెంత్ ఎంటర్ టైన్మెంట్ తో చెప్పబోతున్నాం. ఇది చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం వుంది. కథ 70శాతం రెడీ అయిపొయింది. త్వరలోనే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తాం.

నీకోసం సినిమాకి ఇప్పటికి ఫిల్మ్ మేకింగ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి?

- టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.  టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే వుంటాను. విశ్వం చుస్తే అది మీకు అర్ధమౌతుంది. మనకి డ్రైవింగ్ వస్తే కార్ లో ఎన్ని ఫీచర్స్ వున్నా వాడగలం. నిజం చెప్పాలంటే అప్పటి కంటే ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ చాలా ఈజీ.

కొత్తగా దర్శకులు కావాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా?

-నాకు సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు. నా ఎక్స్ పీరియన్స్ ఏమిటంటే.. అన్ని క్రాఫ్ట్స్ లోకి ప్రధానమైన క్రాఫ్ట్ స్క్రిప్ట్. దాన్ని బలంగా చేసుకుంటే అన్ని ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి.

మీ సినిమాల్లో నెక్స్ట్ రీరిలీజ్ అంటే ఏం చెప్తారు?

-వెంకీ రిరిలీజ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ దుబాయ్ శీను, బాద్ షా, దూకుడు... ఇలా చాలా సినిమాలని అడుగుతున్నారు. ఆ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి డెఫినెట్ గా అవుతాయి.

మీ కెరీర్ లో సీక్వెల్ తీయాలంటే ?

-సీక్వెల్ అంటే వెంకీ గురించే ఆలోచనలు వస్తుంటాయి. ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. వెంకీకి సీక్వెల్ చేయాలనే ఆలోచన వుంది.

ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ


No comments