మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న 'సారంగపాణి జాతకం' సినిమాలో రెండో పాట 'సంచారి సంచారి' విడుదల

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా 'సారంగపాణి జాతకం'. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తుందీ సినిమా. టైటిల్ సాంగ్ 'సారంగో సారంగో...' కొన్ని రోజుల క్రితం విడుదలైంది. రెండో పాట 'సంచారి... సంచారి...'ని ఈ రోజు విడుదల చేశారు.

'సంచారి సంచారి... ఎటువైపో నీ దారి
చిరునామా లేని లేఖలా... చెలి కాటుక చీకటి రేఖలా'
అంటూ సాగిన ఈ గీతాన్ని 'సరస్వతీపుత్ర' రామజోగయ్య శాస్త్రి రాశారు. 

వివేక్ సాగర్ స్వరపరిచిన అందమైన బాణీకి సంజిత్ హెగ్డే గాత్రం తోడు కావడంతో పాటలో విరహ వేదన అందంగా ఆవిష్కృతం అయ్యింది. 

'సంచారి సంచారి...' పాట గురించి దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ... ''ఎటువంటి కథలోనైనా భావోద్వేగం లేకపోతే ఆ కథకు పరిపూర్ణత ఉండదు, 'సారంగపాణి జాతకం' లాంటి పూర్తి నిడివి హాస్యరస చిత్రంలో కూడా! ముఖ్యంగా 'సారంగపాణి జాతకం' సినిమాలో ప్రధానమైన అంశం ప్రేమ. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి, తన నమ్మకానికి మధ్య నలిగిపోయిన వ్యక్తి కథే 'సారంగపాణి జాతకం'. 'సంచారి' అనే పాట తన నమ్మకం వల్ల తాను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని కోల్పోయే సందర్భంలో వస్తుంది. కొంత విరహ వేదన, కొంత ఆ అమ్మాయిని కోల్పోతాననే తపన - వేదన మేళవించిన గీతమిది. ద్వితీయార్థంలో కీలకమైన సందర్భంలో వచ్చిన తర్వాత కథ గమనాన్ని మారుస్తుంది. అమ్మాయిని పొందాలనే అతని కోరికను బలంగా మార్చి, ఆఖరి ఆటంకాన్ని ఎదుర్కోవడానికి ప్రేరేపిస్తుంది. ఈ పాటకు కథలో మంచి ప్రాముఖ్యం ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి. సంజీత్ హెగ్డే అద్భుతంగా పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గారు ఎంత బాగా రాస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ శైలి గుర్తొచ్చే పాట ఇది. మా సినిమాలో ఉన్నవే నాలుగు పాటలు. అందులో ఈ 'సంచారి...' చిన్న పాట, చాలా అందమైన పాట. కథా గమనాన్ని నిర్దేశించే పాట. అదే సమయంలో సారంగపాణి మానసిక స్థితిని  ఒకవైపు ప్రకటిస్తూ... మరోవైపు ప్రియురాలి పట్ల ప్రేమ, విరహ వేదన ఆవిష్కరిస్తుంది. సినిమాలో వన్నాఫ్ ది హైలైట్స్. విజువల్, ఎమోషనల్ పరంగానూ బావుంటుంది. ప్రియదర్శి, రూప నటన కూడా బావుంటుంది. నాకు ఇష్టమైన పాట ప్రేక్షకులకు కూడా దగ్గర అవుతుందని నమ్ముతున్నాను'' అని అన్నారు.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, 'ఐమ్యాక్స్' వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు - అశ్విన్, డిజిటల్ పీఆర్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) - పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ - వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన - దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి. .

No comments