విజయవాడలో ఎన్.టి.ఆర్. సినీ వజ్రోత్సవ వేడుక
మహానటుడు, ప్రజానాయకుడు ఎన్.టి. రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలను శనివారం రోజు విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఎన్.టి.ఆర్. లిటరేచర్ కమిటీ చైర్మన్ శ్రీ టి.డి. జనార్థన్ ఈ రోజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడుగారు, భారతీయ జనాతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి గారు, ఎన్.టి. రామారావు కుమారులు నందమూరి మోహన కృష్ణ, రామకృష్ణ, జయశంకర్ తోపాటు తెలుగు సినిమారంగంలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పాల్గొంటారని జనార్థన్ తెలిపారు.
ఎన్.టి. రామారావు 1949లో మీర్జాపురం రాజావారు ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన 'మనదేశం' చిత్రంతో నటుడుగా పరిచయం అయ్యారని ఆ సినిమా విడుదలై ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తయిందని అందుకే అన్నగారి సినీ వజ్రోత్సవ వేడుకలను ఆయనకు ఇష్టమైన విజయవాడలో నిర్వహిస్తున్నామని , ఈ కార్యక్రమానికి మనదేశం చిత్ర నిర్మాత శ్రీమతి కృష్ణవేణి హాజరవుతున్నారని జనార్థన్ తెలిపారు.
ఎన్.టి.ఆర్. సినిమారంగంలో ప్రవేశించిన తర్వాత ఆయన స్వయంగా పత్రికలలో రాసిన వ్యాసాలు, సినిమా జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో 'తారకరామం' అనే అన్నగారి అంతరంగం పుస్తకాన్ని ఈ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆవిష్కరిస్తున్నట్లు జనార్థన్ తెలిపారు. 'తారకరామం' గ్రంథం సీనియర్ జర్నలిస్ట్, రచయిత భగీరథ సంపాదకత్వంతో అపూర్వంగా రూపొందిందని ఇది అన్నగారి అంతరగాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదని జనార్థన్ తెలిపారు.
ఎన్.టి.ఆర్. సినిమా సినీ వజ్రోత్సవ వేడుకలను విజయవాడలోని మురళి రీసార్ట్ లో నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జనార్థన్ తెలిపారు. మీడియా మిత్రులు పాల్గని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.
No comments